రాహుల్ నరేంద్ర మోదీకి ట్వీట్‌లో ఏమి సవాల్ చేసాడు.

కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్లో కళంకితుల గురించి మాట్లాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. శనివారం ఆయన ఇచ్చిన ఓ ట్వీట్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప సహా ఇతర కళంకిత అభ్యర్థుల గురించి 5 నిమిషాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు.

‘‘మీరు చాలా మాట్లాడుతున్నారు. సమస్య ఏమిటంటే, మీ మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదు. కర్ణాటకలో మీ అభ్యర్థుల ఎంపిక సారాంశం ఇదిగో. ‘కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్’ల ఎపిసోడ్ నడుస్తున్నట్లుంది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు పోస్ట్ చేసిన ఓ వీడియోలో రెడ్డి బ్రదర్స్ గ్యాంగ్‌కి ఇచ్చిన 8 టిక్కెట్ల గురించి 5 నిమిషాలు మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

అవినీతి, మోసం, ఫోర్జరీ చేసినట్లు 23 కేసులున్న వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేశారని రాహుల్ దుయ్యబట్టారు. అవినీతి కేసుల్లో ఉన్న మీ (బీజేపీ) టాప్ 11 నేతల గురించి ఎప్పుడు మాట్లాడతారని ఈ వీడియోలో ప్రశ్నించారు. ఈ వీడియోలో బీజేపీ నేతలు శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబు, కట్టా సుబ్రహ్మణ్య నాయుడు, సీ టీ రవి, మురుగేశ్ నిరానీ, కృష్ణయ్య శెట్టి, మాలూర్, శివన గౌడ, అశోక్, శోభ కరంద్లాజే ఫొటోలు ఉన్నాయి. వీరంతా మే 12న జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.

‘‘మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. మీరు సమాధానాలు చెప్పడానికి కాగితాలు చూడొచ్చు’’ అని రాహుల్ సవాల్ చేశారు.