రికార్డు కలెక్షన్లు తో ‘భరత్‌’

హైదరాబాద్‌: ప్రిన్స్‌ మహేష్‌బాబు తాజా సినిమా ‘భరత్‌ అనే నేను’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. హిట్‌ టాక్‌ రావడంలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విదేశాల్లోనూ ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో మొదటి ఐదు రోజుల్లో(‍ప్రివ్యూస్‌తో కలుపుకుని) ఈ సినిమా రూ. 17.91 కోట్లు వసూలు చేసి రూ. 20 కోట్ల మార్క్‌ దిశగా వెళుతోంది. అటు ఆస్ట్రేలియాలోనూ ‘భరత్‌..’ సందడి చేస్తున్నాడు. ఏప్రిల్‌ 20న విడుదలైన ఈ చిత్రం మొదటి ఐదు రోజుల్లో రూ. 2.02 కోట్లు వసూలు చేసినట్టు ప్రముఖ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేశారు.

కేరళలోనూ ఈ సినిమాకు ఆదరణ బాగుంది. మొదటి 5 రోజుల్లో రూ. 7.63 లక్షలు తెచ్చు​కుంది. ఈ సినిమా ఇప్పటికే రూ. 125 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించినట్టు చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. మహేష్‌బాబుకు జోడిగా కియారా అద్వాని నటించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించాడు.