రియాల్టీ షో.. పట్టుతప్పిన ఫీట్‌..

రియాల్టీ షోలో ఊహించని ఘటన ఎదురైంది. ఫీట్‌ చేస్తున్న జంటలో పట్టుతప్పి మహిళ కిందపడిపోగా.. రక్షణ చర్యలు ఉండటంతో ఆమె సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది.

అమెరికా టీవీ రియాల్టీషో అమెరికా’స్‌ గాట్‌ టాలెంట్‌లో ఇది చోటు చేసుకుంది. ట్రాపేజ్‌ ట్రిక్స్‌ చేసే అక్రోబాట్‌(విన్యాసాలు చేయటం) జంట టైస్‌ నిల్సన్‌, అతని భార్య మేరీ వోల్ఫేలు విన్యాసాలు చేయటానికి సిద్ధమయ్యారు. చుట్టూ మంట.. పైన రింగులపై విన్యాసాలు చేస్తూ ఊపిరి బిగపట్టుకునే రీతిలో విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేస్తుండగా.. పట్టుతప్పి వోల్ఫే కిందపడిపోయారు. అయితే పరుపు ఉండటంతో ఆమె సురక్షితంగా బయటపడగలిగారు. వెంటనే టైస్‌ కూడా కిందకు దిగగా.. వారిద్దరికీ జడ్జిలు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. తాము మరొకసారి ఫీట్‌ చేస్తామని వాళ్లు జడ్జిలతో చెప్పగా.. ‘ఇది టాలెంట్‌ షో మాత్రమేనని.. ఫర్‌ఫెక్షన్‌ షో కాదని’ రిస్క్‌ వద్దంటూ సున్నితంగా వారించారు.

ఫీట్‌చేస్తున్న సమయంలో జడ్జిల హవభావాలు, ప్రేక్షకులు గోల.. ఆ జంట రెండేళ్ల కొడుకు, అతని నానమ్మ చూస్తూ దిగ్భ్రాంతికి గురికావటం.. మొత్తానికి ఆ కట్‌తో ఎపిసోడ్‌పై ఆత్రుత పెంచేసిన AGT నిర్వాహకులు.. ఎపిసోడ్‌ వ్యూవర్‌షిప్‌ మాత్రం విపరీతంగా రాబట్టడంలో సక్సెస్‌ అయ్యారు.