రూ.700 కోట్ల పెట్టుబడికి రూ.2,223.9 కోట్ల రాయితీలు

ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘చారాణా కోడికి బారాణా మసాలా’ తరహాలో ఉందని అధికారులు, పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హెచ్‌సీఎల్‌ కంపెనీపై చూపుతున్న వల్లమాలిన ప్రేమే అందుకు నిదర్శనమంటున్నారు. 12 ఏళ్లలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ సంస్థకు సర్కారు రూ.2,223.9 కోట్ల దాకా రాయితీలు ప్రకటించడం గమనార్హం. పోనీ ఒప్పందం ప్రకారం 7,500 మందికి ఉపాధి కల్పిసుదని చెబుతున్నారు.

పెట్టుబడికి మూడు రెట్లు అదనంగా
ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఐటీ పాలసీ 2014–20 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా హెచ్‌సీఎల్‌కు భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రూ.700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే దానికి మూడు రెట్లు కంటే ఎక్కువగా రూ.2,223.9 కోట్ల రాయితీలను ప్రభుత్వం కల్పించనుండటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే హెచ్‌సీఎల్‌ పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో నడిచే సంస్థలా ఉందటూ ఐటీ శాఖలోని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

భూమి ద్వారానే రూ.728.9 కోట్ల లబ్ధి
విజయవాడకు సమీపంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎదురుగా హెచ్‌సీఎల్‌కు 49.86 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మొదటి దశలో ఎకరా రూ.30 లక్షలు చొప్పున 29.86 ఎకరాలు, రెండోదశలో రూ.50 లక్షలు చొప్పున మరో 20 ఎకరాలను ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎల్‌అండ్‌టీ మేధా టవర్స్‌ పక్కనే ఉన్న స్థలం కావడంతో ఇప్పుడు అక్కడ బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.15 కోట్లు పైనే పలుకుతోంది. అంటే 49.86 ఎకరాల భూమి విలువ రూ.747.9 కోట్లు ఉంటుంది. కానీ ఇంత ఖరీదైన భూమిని కేవలం రూ.19 కోట్లకే కేటాయిచడం ద్వారా హెచ్‌సీఎల్‌ కంపెనీకి ప్రభుత్వం రూ.728.9 కోట్ల మేర ప్రయోజనాన్ని కల్పించింది.

ఇతర చోట్ల పనిచేసే సంస్థ ఉద్యోగులే విజయవాడకు తరలింపు
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ రెండు దశల్లో 7,500 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. మొదటి దశలో ఏడేళ్లల్లో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టి 4,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఐదేళ్లలో రూ.300 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 3,500కి ఉపాధి కల్పించనుంది. ఉపాధి కల్పించిన ప్రతి ఉద్యోగికి లక్ష రూపాయల చొప్పున ఈ కంపెనీకి ప్రభుత్వం ఒకేసారి రాయితీగా చెల్లించనుంది. అంటే 7,500 మందికి లక్ష రూపాయల చొప్పున లెక్కిస్తే రూ.75 కోట్లు కంపెనీకి రాయితీ రూపంలో అందనున్నాయి. కానీ ఇక్కడ కూడా ఓ మతలబు ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న తమ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని ఇక్కడకు తరలిస్తామని హెచ్‌సీఎల్‌ పేర్కొంది. హెచ్‌సీఎల్‌ కేంద్రాల్లో 6,700 మంది తెలుగువారు పని చేస్తుండగా 627 మంది విజయవాడ వచ్చేందుకు ఆసక్తి చూపినట్లు సంస్థ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అధికారి వి.వి.అప్పారావు తెలిపారు. అంటే ఇప్పటికే వివిధ చోట్ల పనిచేస్తున్న సంస్థ ఉద్యోగులను విజయవాడ తరలించి కొత్త ఉద్యోగాల కల్పన పేరుతో రాయితీలను కంపెనీ అప్పనంగా పొందనున్నట్లు తేలిపోతోంది.

శిక్షణ రాయితీలు రూ.144 కోట్లు..
ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత అంతర్గత శిక్షణ ఇవ్వడం పరిపాటి. కానీ హెచ్‌సీఎల్‌లో ఇలా శిక్షణ ఇస్తున్నందుకుగాను ప్రతి ఉద్యోగికి నెలకు రూ.5,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కంపెనీకి చెల్లించనుంది. ఇందుకోసం 1,000 సీట్ల సామర్థ్యంతో హెచ్‌సీఎల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. శిక్షణ ఆర్నెళ్లు ఉంటుందనుకున్నా ఏటా కనీసం రెండు వేల మంది ఈ కేంద్రంలో శిక్షణ పొందనున్నారు. అంటే 12 ఏళ్లలో 24,000 మంది చొప్పున లెక్కిస్తే సుమారు రూ.144 కోట్లు హెచ్‌సీఎల్‌కు శిక్షణ రాయితీలు కింద లభించనున్నాయి. తమ సంస్థలోకి తీసుకున్న వారికి మాత్రమే ఇందులో శిక్షణ ఇవ్వనున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శివశంకర్‌ తెలిపారు.

ఇతర రాయితీల కింద మరో వంద కోట్లు
ఇవికాకుండా బ్యాంకుల నుంచి తీసుకునే రుణంపై 5% వడ్డీ రాయితీ చొప్పున మొత్తం 12 ఏళ్లలో గరిష్టంగా రూ.76 కోట్లు ప్రభుత్వం ఇవ్వనుంది. ఐటీ పాలసీ 2014–015 కింద స్టాంప్‌ డ్యూ.టీ, రిజిస్ట్రేషన్‌ ఫీ, వ్యాట్, సీఎస్‌టీ, జీఎస్‌టీల నుంచి 100% మినహాయింపు, 24 గంటల విద్యుత్‌ సరఫరా కోసం 33 కేవీ–133 కేవీ ప్రత్యేక ట్రాన్స్‌మిషన్‌ ఏర్పాటు, తక్కువ ధరకు యుటిలిటీ సర్వీసులు, రవాణా వంటి అదనపు సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే హెచ్‌సీఎల్‌కు ఏటా కనీసం రూ.100 కోట్ల వరకు ప్రయోజనం కలగనుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 ఏళ్లకు రూ.1,200 కోట్ల మేర ప్రయోజనం దక్కనుంది. మొత్తంగా రాయితీలు, ఇతర ప్రయోజనాల కింద హెచ్‌సీఎల్‌ రూ.2,223.9 కోట్ల మేర లబ్ధిపొందే అవకాశముందని అంచనా వేస్తున్నారు.