రెండు వెర్షన్లలో వాట్సాప్ గ్రూప్‌ వీడియో కాలింగ్‌..

ఎట్టకేలకు వాట్సాప్‌ వినియోగదారులకు తీపికబురు అందింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాట్సాప్‌ గ్రూప్‌ వీడియో కాలింగ్‌ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో ఒకరికంటే ఎక్కువమంది గ్రూప్‌ కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ రెండు వెర్షన్లలోనూ ఈ ఫీచర్‌ను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఫేస్బుక్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ సదుపాయం ప్రవేశపెట్టబోతున్నట్లు ఫేస్‌బుక్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఒక గ్రూపులోని పలువురు సభ్యులు లేదా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకుమించి సభ్యులు ఈ ఫీచర్‌ ద్వారా వీడియో ద్వారా సంభాషించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ బేటా 2.18.155 వెర్షన్ వాడుతున్న ఎంపిక చేయబడిన కొంతమంది వినియోగదారులకు తాజాగా ఒక వీడియో కాల్‌నుఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. ఐవోఎస్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌ 2.18.52 వెర్షన్లో ఈ గ్రూప్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు వాట్సాప్‌ వెల్లడించింది. ఇందుకోసం యూజర్లు వీడియో కాల్స్‌ ఆప్షన్‌ను ఎంచుకుని, మాట్లాడాలనుకున్న వారితో హ్యాపీగా మాట్లాడు కోవచ్చు. మరోవైపు ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుందని వాట్సాప్‌ ఫ్యావరెట్‌ సైట్ WaBetaInfo నివేదించింది. అయితే త్వరలోనే ప్రతి వినియోగదారుడికి ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస‍్తుందని పేర్కొంది. దీనికనుగుణంగానే చాలామంది వాట్సాప్‌ యూజర్లు ఈ కొత్త గ్రూప్‌ వీడియో కాలింగ్‌ ఫీచర్‌ ఇంకా తమకు అందుబాటులోకి రాలేదని రిపోర్టు చేయడం గమనార్హం.