విమాన సిబ్బంది నిర్లక్ష్యం.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం

సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జెట్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ 9డబ్ల్యూ 0696 నెంబర్ విమానం గురువారం ఉదయం ముంబై నుంచి జైపూర్‌ బయలుదేరింది. అయితే విమానం ల్యాండ్‌ అయ్యే సమయంలో కొందరు ప్రయాణికులకు తీవ్ర తల, చెవినొప్పి రావడమే కాకుండా అకస్మాత్తుగా ముక్కు నుంచి రక్తం రావడంతో భయబ్రాంతులకు గురయ్యారు. విమాన క్యాబిన్‌లో ఎయిర్ ప్రెజర్‌ను నియంత్రించడం సిబ్బంది మర్చిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో వెంటనే అత్యవసర ఆక్సిజన్‌ మాస్క్‌లను ప్రయాణికులు ధరించాల్సివచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 166 మంది ప్రయాణికులు ఉన్నారు.

సిబ్బంది చేసిన తప్పిదం వల్ల ముంబై నుంచి జైపూర్‌ వెళ్లాల్సిన విమానం కాస్తా, తిరిగి ముంబై వెళ్లాల్సివచ్చింది. ముంబై విమానాశ్రయంలో బాధిత ప్రయాణికులకు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా.. వ్యవహరించిన కారణంగా ఇప్పటికే పైలట్‌ని సస్పెండ్‌ చేసి, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు సమాచారం.