విరుచుకుపడ్డ ధోని

వారెవ్వా.. ధోని! ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ తనదైన శైలిలో రెచ్చిపోతే ఏ జట్టుకైనా తట్టుకోవడం కష్టమే. ఎంతటి లక్ష్యమైనా ఉఫ్ఫే! బుధవారం బెంగళూరు అతడి బారిన పడింది. ఒకప్పటిలా బ్యాటుతో విధ్వంసం సృష్టించిన ధోని.. సిక్స్‌ల మోతతో అభిమానులను ఉర్రూతలూగించాడు. అతడి జోరుకు అంబటి రాయుడు కళ్లు చెదిరే బ్యాటింగ్‌ తోడవడంతో భారీ స్కోర్ల మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌.. బెంగళూరును మట్టికరిపించింది. కొండంత లక్ష్యాన్ని పిండి చేసింది. డివిలియర్స్‌ శ్రమ వృథా అయింది.
చెన్నై
ఈ ఐపీఎల్‌లో చెన్నై చక్కని ప్రదర్శన కొనసాగుతోంది. ధోని, రాయుడు మెరిసిన వేళ చెన్నై సూపర్‌కింగ్స్‌ 5 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్‌ (68; 30 బంతుల్లో 2×4, 8×6), డికాక్‌ (53; 37 బంతుల్లో 1×4, 4×6) మెరవడంతో బెంగళూరు మొదట 8 వికెట్లకు 205 పరుగులు సాధించింది. ధోని (70 నాటౌట్‌; 34 బంతుల్లో 1×4, 7×6), రాయుడు (82; 53 బంతుల్లో 3×4, 8×6) విరుచుకుపడడంతో భారీ లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ధోనీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.