వెండితెరకెక్కించడానికి సన్నాహాలు…మ‌రో న‌టి జీవితం

చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల కాలం నడుస్తోందనిపిస్తోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర చిత్రంగా తెరకెక్కి విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. సావిత్రి పాత్రలో నటించిన కీర్తీసురేశ్‌ ప్రశంసల జడివానలో తడిసి ముద్దవుతోంది. అదేవిధంగా సిల్క్‌స్మిత జీవిత చరిత్ర బాలీవుడ్‌లో ది దర్టీ పిక్చర్‌ పేరుతో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఆందులో సిల్క్‌ పాత్రలో నటించిన విద్యాబాలన్‌ జాతీయ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం సావిత్రి పాత్రలో నటించిన కీర్తీసురేశ్‌కు పలు అవార్డులు వరించడం ఖాయం అంటున్నారు సినీ పండితులు. ఇదిలాఉండగా తమిళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంజీఆర్‌ బయోగ్రఫీ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. అదేవిధంగా జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా నటి సౌందర్య జీవితం వెండితెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. తెలుగు, తమిళం, కన్నడంభాషల్లో కథానాయకిగా మంచి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. ముఖ్యంగా కోలీవుడ్‌లో కమలహాసన్, రజనీకాంత్‌ వంటి స్టార్స్‌తో నటించారు. టాలీవుడ్‌లో అందరు ప్రముఖ కథానాయకులతోనూ నటించారు. మంచి ఫామ్‌లో ఉండగానే సౌందర్య హెలి కాఫ్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆమె జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు నిర్మాత రాజ్‌ కందుకూరి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ చిత్రంలో సౌందర్యగా మారే లక్కీఛాన్స్‌ ఏ నటికి దక్కుతుందో..!