వేగంగా సాగుతున్నా పోలవరం ప్రాజెక్టు

 

పోలవరం ప్రాజెక్టులో మరో అతికీలక నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్‌ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు.. ప్రణాళిక ప్రకారం అత్యంత వేగంగా సాగుతున్నాయి. అనుబంధ పనులను పూర్తి చేయడానికి జలవనరుల శాఖ, నవయుగ కంపెనీ అడుగులు వేస్తున్నాయి.
దీనిలో భాగంగా స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులను సీఎం చంద్రబాబు ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు ఇప్పటికే స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు, డయాఫ్రం వాల్‌, కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభిస్తున్నారు. స్పిల్‌వే నుంచి వచ్చే నీటిని మొత్తం ఈ స్పిల్‌ చానల్‌ ద్వారా తిరిగి గోదావరిలోకి కలుపుతారు.
వేగంగా మట్టి తరలింపు:
స్పిల్‌ చానల్‌ నిర్మాణంలో మొత్తం 3.20 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని బయటకు తరలించాల్సి ఉంది. ఇందుకోసం వందల సంఖ్యలో వాహనాలను భారీ డంపర్లు, ఎక్స్‌వేటర్లను మోహరించారు. రాత్రి పగలు పని చేస్తూ ఇప్పటి వరకు 2.18 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనిని పూర్తిచేశాయి. ఇంకా 1.2 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీయాల్సి ఉంది. స్పిల్‌ చానల్‌లో మొత్తం 2.92 కిలోమీటర్ల పొడవునా.. కిలోమీటరు వెడల్పులో కాంక్రీట్‌ వేయనున్నారు. దీని నిర్మాణంలో 18.80 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించనున్నారు. ఈ పనులను 7,520 బ్లాక్‌లుగా విభజించి కాంక్రీట్‌ వేస్తారు. పది మీటర్ల వెడల్పు, పది మీటర్ల పొడవు, ఒక మీటరు ఎత్తుతో వేసి దానిని ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. ఆ విధంగా నిర్మాణానికి 4,13,600 టన్నుల సిమెంట్‌ను, 17 లక్షల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌ను, 9 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వినియోగించనున్నారు.

గో‘దారి’ మళ్లింపు
వరద సమయంలో మహోగ్రరూపంతో గోదావరి ప్రవహిస్తుంది. దాదాపు 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. దీనికి అడ్డుకట్ట వేసి స్పిల్‌ చానల్‌ ద్వారా నీటిని మళ్లిస్తారు. పోలవరం గ్రామం దగ్గర ఈ నీరు గోదావరిలో కలుస్తుంది. దీంతో గోదావరి ప్రవాహం ప్రాజెక్టు ప్రాంతం నుంచి పోలవరం గ్రామం వరకూ 3 కిలోమీటర్లు పక్కకు జరిగి స్పిల్‌ చానల్‌ ద్వారా ప్రవహిస్తుంది.