వైసీపీలోకి కాటసాని లైన్‌ క్లియర్‌

వైసీపీలోకి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరికకు లైన్‌ క్లియర్‌ అయింది. 29వ తేదీ విజయవాడ సమీపంలోని పామర్రు వద్ద వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు కాటసాని స్పష్టం చేశారు. బుధవారం కల్లూరులోని ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18న పాణ్యం నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యానని, 80 శాతం మంది వైసీపీలో చేరాలని తమ అభిప్రాయం చెప్పారని పేర్కొన్నారు. ఈ నెల 29న పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివెళ్లి వైసీపీలో చేరుతున్నానని చెప్పారు.

బీజేపీకి మూకుమ్మడి రాజీనామా
భారతీయ జనతాపార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, మెంబర్‌షి్‌పకు బుధవారమే రాజీనామా చేశానన్నారు. పాణ్యం నియోజకవర్గంలోని 4 మండలాల్లోని కార్యకర్తలంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారని కాటసాని స్పష్టం చేశారు. పాణ్యం నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని కాటసాని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కృష్ణమూర్తి, నరసింహులు, నాయకులు ప్రభాకర్‌రెడ్డి రమణారెడ్డి, దండులక్ష్మీకాంతరెడ్డి, హనుమంతరెడ్డి, గోపాల్‌రెడ్డి, శివుడు, సుభాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

పాణ్యం వైసీపీ టిక్కెట్‌ మాకే: ఎమ్మెల్యే
పాణ్యం నియోజకవర్గ టిక్కెట్టు తమదేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత స్పష్టం చేశారు. బుధవారం కందికాయపల్లెలో పెద్దమ్మ జాతరలో పాల్గొన్న ఆమె విలేఖరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె మాట్లాడారు. కాటసాని తమ పార్టీలో చేరడం వల్ల మరింత బలం చేకూరుతుందన్నారు. వైసీపీలో మొదటి నుంచి సేవలందిస్తున్న తనకే టిక్కెట్టు ఇస్తానని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తాను పార్టీ వెంటే ఉంటూ జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వైసీపీలో ఉండటంపై జగన్‌ తమపై పూర్తి నమ్మకం ఉంచారని పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థి ఎంపిక అధిష్టానం నిర్ణయమన్నారు. పాణ్యం మండలంలో తాగునీరు, విద్యుత్‌ సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నామన్నారు. పాణ్యం టౌన్‌ రోడ్డు అభివృద్ధిపై ఆర్‌అండ్‌బీ అధికారులతో చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, వెంకటసుబ్బయ్య, పాల్గొన్నారు.