శబరిమల ఆలయంలో మహిళల నిరోధం అందుకే..

కేరళలోని శబరిమల ఆలయంలోకి పురుషుల తరహాలో మహిళలూ వెళ్లి పూజలు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రావన్‌కోర్‌ దేవస్ధానం బోర్డు గురువారం స్పందించింది. ఈ ఆలయంలో స్వామి విశిష్టత ఆధారంగానే రుతుక్రమం ఉన్న మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తున్నామని స్పష్టం చేసింది. దైవం స్వాభావిక విశిష్టత, ఆలయ చరిత్ర కారణంగానే అలాంటి మహిళలను ఆలయంలోపలికి అనుమతించడం లేదని దేవస్ధానం తరపు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి సుప్రీం కోర్టుకు నివేదించారు.

శబరిమల అయ్యప్ప బ్రహ్మచారి కావడంతోనే ఆలయంలో ఈ పద్ధతి అనుసరిస్తున్నారని సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వాదించారు. ఇతర అయ్యప్ప దేవవాలయాల్లో మహిళలను లోపలికి అనుమతిస్తున్నారని వివరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా కలుగచేసుకుని వారికి (మహిళలు) శబరిమల ఆలయంపైనే విశ్వాసం ఉండవచ్చని, దేశంలో ఎన్నో జగన్నాధ్‌ ఆలయాలున్నా పూరీ జగన్నాధ ఆలయానికే భక్తులు పోటెత్తుతుండటాన్ని ప్రస్తావించారు.

శబరిమల దైవంపై మహిళలకు విశ్వాసం ఉంటే ఆలయ సంప్రదాయాలను, పద్ధతులను వారు గౌరవించాలని సింఘ్వీ వాదించారు. ఈ క్రమంలో మతపరంగా అనుసరించే పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండవచ్చా అని సుప్రీం బెంచ్‌ ప్రశ్నించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే.