శ్రీదేవి..ని అడ్డుకున్నరామ్‌ గోపాల్‌ వర్మ

తెలుగు సినిమా ఖ్యాతీని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులకు కూడా మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ముఖ్యంగా శివగామి పాత్రలో నటించిన రమ్యకృష్ణకు ఈ సినిమా వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ పాత్రకు ముందుగా అతిలోకసుందరి శ్రీదేవిని తీసుకోవాలని భావించారు. కానీ శ్రీదేవి అంగీకరించకపోవటంతో రమ్యకృష్ణను తీసుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి కూడా పలు వేదికల మీద ప్రస్తావించారు.

అయితే తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో శ్రీదేవికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శ్రీదేవి.. బాహుబలి సినిమా చేయకపోవటానికి కారణం బోని కపూరే అన్నారు వర్మ. ఈ విషయంపై తాను అప్పట్లో శ్రీదేవితో మూడు నాలుగుసార్లు చర్చించానని.. శ్రీదేవి కూడా బాహుబలి సినిమాలో నటించేందుకు ఇంట్రస్ట్‌ చూపించారని.. కానీ బోనీనే భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసి బాహుబలి చేయకుండా చేశారన్నారు. బోని నిర్ణయాల కారణంగానే శ్రీదేవి కెరీర్‌ పరంగా ఎంతో నష్టపోయారని.. పెళ్లి తరువాత ఆమె ఒక్క రోజు కూడా ఆనందంగా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.