శ్రీవారి భక్తులకు..టిటిడి హెచ్చ‌రిక‌

భక్తింటే శ్రీవారి భక్తులదే..

తిరుమల శ్రీవారంటే భక్తులకు ఎనలేని భక్తి.. ఏడాదికోసారైనా స్వామిని దర్శించి తమ మొక్కులు తీర్చుకోవాలనే తపన భక్తులలో ఉంటుంది. నిరంతరం పనిదినాల్లో ఒత్తిడితో ఉన్న వారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడానికి వేసవి సెలవుల్లో ఉత్సుకత చూపుతారు. ఈ క్రమంలో స్వామి దర్శనాన్ని భక్తులకు సులభతరం చేయడం కోసం తితిదే అధికారిక వెబ్‌సైట్‌లను అందుబాటులోనికి తెచ్చింది. వీటి ద్వారా భక్తులు స్వామి దర్శన టికెట్లు, వసతి, సేవా టికెట్లను పొందే విధంగా వసతులు అందుబాటులోనికి తెచ్చింది. కానీ ఇదే అదునుగా చేసుకొని కొందరు నకీలీ వెబ్‌సైట్లను ఆన్‌లైన్‌లో ఉంచి భక్తులను మోసం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం నమోదు చేసుకున్న టికెట్లు నకిలీవని భక్తులు తెలుసుకుని ఖంగుతింటున్నారు.
ఎలా బుక్‌ చేసుకోవాలంటే
స్వామి దర్శనం కోసం భక్తులు అంతర్జాలం ద్వారా టికెట్‌ పొందాలంటే తితిదే అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలి. కడప తితిదే కల్యాణమండపం, పులివెందుల తితిదే కల్యాణమండపం, ప్రొద్దుటూరు తితిదే కల్యాణమండపంలో ఈ దర్శన్‌ కేంద్రాలు ఉన్నాయి. అక్కడికి మంగళవారం కాక మిగతా పని దినాల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం విరామం తరువాత 2 గంటల నుంచి 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు. తిరుమలకు వెళ్లానుకున్న వారు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు పత్రం ఆధార్‌ గుర్తింపు పత్రం, రేషన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఇలా ఏదైనా తీసుకుని వెళ్లి దర్శన టికెట్‌, వసతి గృహాలు, సేవాటికెట్లను పొందవచ్చు. కుటుంబ సభ్యులు అందరూ ఈ దర్శన్‌ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఒకరు వెళ్లి గుర్తింపు పత్రములు సమర్పించి వారందరికి వసతి, టికెట్‌ పొందవచ్చు. ప్రభుత్వ ప్రధాన తపాలా కార్యాలయం, టిటిడీసేవాలైన్‌.కమ్‌, మీ సేవా కేంద్రాల్లో సైతం ఈ వసతిని పొందవచ్చు. వీరి ద్వారా నమోదు చేసుకుని డబ్బు చెల్లించిన తరువాత మనం మన పేర ఉన్న పత్రాలను ఆ సేవా కేంద్రాల్లో టికెట్‌లను ప్రింట్‌ తీసుకోవచ్చు. అందులో పేరు, మనం ఇచ్చిన గుర్తింపు సంఖ్య తదితర వివరాలు ఉంటాయి. అపుడు మనం నిశ్చింతగా స్వామి దర్శనం వెళ్లవచ్చు.

నకిలీలున్నాయి.. తస్మాత్‌ జాగ్రత్త
అంతర్జాలంలో పలు మోసపు వెబ్‌సైట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మనం బుక్‌ చేసుకునేటపుడు తగిన అవగాహన ఉండాలి. లేకపొతే నకిలీ వెబ్‌సైట్లు మనల్ని మోసగిస్తాయి. ఇటీవల కడప నగరానికి చెందిన వి.శ్రీనివాసులరెడ్డి ఆన్‌లైన్‌ టిటిడిదర్శన్‌.కమ్‌ వెబ్‌సైట్‌లో రూ.300ల టికెట్లు అయిదు నమోదు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో తన ఖాతా నుంచి డబ్బు బదలీ చేశారు. నమోదు చేసుకునే సమయంలో పేరు, వయసు, గుర్తింపుపత్రం సంఖ్య అన్ని వివరాలు ఇచ్చారు. చివరగా టికెట్‌ చూస్తే అందులో ఏవివరాలు లేవు. మోసపోయానేమోనన్న అనుమానంతో ఆయన తితిదే విచారణ ఫోన్‌ నెంబరు 08772277777ను సంప్రదించగా వారు అంతా శోధించి ఇది నకిలీ అని తేల్చారు. దీంతో బాధితునితో పాటు తితిదే అధికారులు ఖంగుతిన్నారు.

అవగాహనతో ఉండాలి
శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ప్రభుత్వ సేవలు అందించే సంస్థలు, తితిదే అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలి. తితిదే అధికారులు ఇలాంటి మోసపూరిత వెబ్‌సైట్లను నిషేధించి అవి పనిచేయకుండా చర్యలు తీసుకోవాలి. నమోదు చేసుకున్న భక్తులు తమకు ఎలాంటి అనుమానాలున్నా వెంటనే పైన పేర్కొన్న ఫోన్‌లో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తమ సందేహాన్ని తొలగించుకోవాలి.