శ్రీవారి సన్నిధి తిరుమలలో తరచూ ప్రమాదాలు

మంటరాని పొయ్యిలతో ప్రసాదాల తయారీ..

తిరుమలలో మరో బూందీ పోటు నిర్మాణం దిశగా తితిదే సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పోటులో తరచూ ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించింది. తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతోంది. లడ్డూ ప్రసాదం అవసరాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో పదేళ్ల కింద శ్రీవారి ఆలయంలోని బూందీ పోటును ఆలయం వెలుపలికి తరలించి నూతనంగా 40 పొయ్యిలతో నిర్మాణం చేపట్టింది. ఇక్కడ తయారు చేసిన బూందీని కన్వేయర్‌ బెల్టు ద్వారా ఆలయంలోకి తరలించి ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో లడ్డూలను తయారు చేస్తున్నారు. బూందీ పోటు వెలుపలికి తరలించడంతో నిత్యం 3.50 లక్షల లడ్డూల తయారీకి సామర్థ్యం పెరిగింది. ఆలయంలో ఉన్నప్పుడు రోజుకు 1.50 లక్షలకు మించి తయారు చేయలేని పరిస్థితి ఉండేది. మందిరం వెలుపల ఉన్న బూందీ పోటు ఎత్తు తక్కువగా ఉందని, తద్వారా తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న పోటుకు ఉత్తరం దిశగా ఖాళీగా ఉన్న ప్రాంతంలో మరో బూందీ పోటును అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించాలని సంకల్పించిన తితిదే అధికారులు.. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. తద్వారా ప్రస్తుతం ఉన్న బూందీ పోటుకు విరామం ఇచ్చి పరిశుభ్రత చర్యలు తీసుకోవడానికి సమయం దొరుకుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం విరామం లేకుండా నిత్యం వాడటం వల్ల.. నెయ్యి జిడ్డు పొయ్యిల పైభాగంలో అతుక్కోవడం, వేడికి జిడ్డు నుంచి మంటలు చెలరేగడం, అగ్ని ప్రమాదాలు సంభవించడం.. తరచూ జరుగుతోంది. ఇలా ఈ ఏడాదిలోనే ఇప్పటికే మూడు ప్రమాదాలు జరిగాయి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే ప్రత్యామ్నాయాలపై తితిదే దృష్టి పెట్టింది.
ఆలయంలో మంటలేని పొయ్యిలు
శ్రీవారి ఆలయంలో కూడా ప్రమాదాలకు ఆస్కారం లేకుండా మంటలురాని పొయ్యిలను వినియోగించాలని తితిదే నిర్ణయించింది. చెన్నైలోని అడయార్‌ ఆనందభవన్‌లో వినియోగిస్తున్న తరహాలో పొయ్యిలను ఏర్పాటు చేయడానికి తితిదే రూ.38 లక్షల నిధులను కేటాయించింది. ఆలయంలో లడ్డూల తయారీకి చక్కెర జీరా తయారీతో పాటు వడ, అప్పం, జిలేబి లాంటి పలు రకాల ప్రసాదాల తయారీ కోసం పోటు ఉంది. ఇక్కడ కూడా నిత్యం పొయ్యిలు వంటగ్యాస్‌ ద్వారా వెలుగుతున్నాయి. ఆనంద నిలయానికి పడమర వైపున ఉన్న వడ ప్రసాదం తయారీ పోటులో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. మొదటి దశలో మంటరాని విద్యుత్‌ పొయ్యిలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఇందుకు ఆగమ పండితుల అనుమతి తీసుకున్నారు. దీని పనితీరును బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. చక్కెర జీరా తయారీ విభాగాన్ని ఆలయం వెలుపల బూందీపోటుకు మార్చడానికి చర్యలు తీసుకున్నారు. బూందీని యంత్రాల ద్వారా తయారీ ప్రతిపాదన కూడా తితిదే వద్ద ఉంది. ఇలా త్వరలోనే శ్రీవారి ప్రసాదాల తయారీ విధానంలో పలు మార్పులు వచ్చే అవకాశాలున్నాయి.