సీఎం రమేష్ కి వార్నింగ్ ఇచ్చిన.. మంత్రి ఆది

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ప్రతి పనికీ అడ్డొస్తే కనిపిస్తే కాల్చివేత రోజులొస్తాయని మంత్రి ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయన్నారు. ప్రతి దానికి అడ్డుపడటమేకాకుండా అనవసరమైన విమర్శలు చేస్తున్నారని, తాను గన్‌లాంటి వాడిని.. కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన మినీ మహానాడు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొంత మంది తమపై నీచంగా మాట్లాడుతున్నారని, తాను మార్కెట్‌ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమన్నారు. రామసుబ్బారెడ్డి గానీ, ఆయన వర్గీయులు దేనికి సిద్ధపడినా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు.

రాజ్యసభ సభ్యుడు రమేష్‌ నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారని, ఇక్కడ ఉన్న నాయకులు కాకుండా వారు వందల కోట్ల పనులు చేసుకుంటున్నా తాము పట్టించుకోవడంలేదన్నారు. గతంలో కొండాపురంలో ముంపువాసుల కాలనీల్లో చేపట్టిన పనులకు అడ్డుపడితే ఏమి జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. తాను జమ్మలమడుగు నుంచి కచ్చితంగా పోటీలో నిలబడతానని, తనకు చంద్రబాబు కచ్చితంగా టికెట్‌ ఇస్తారని తెలిపారు. భవిష్యత్తులో ఏమి జరిగినా తాను కార్యకర్తలతో చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. కాగా, మినీ మహానాడుకు మంత్రి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహపడ్డారు.