సీఎం సీటు కోసం… ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి

కేబినెట్‌ విస్తరణ.. ఐదేళ్లపాటు ప్రభుత్వ కొనసాగింపుపై చర్చ

కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి.. సీఎం సీటును జేడీఎస్‌–కాంగ్రెస్‌ కొంతకాలం పాటు పంచుకుంటాయంటూ వస్తున్న వార్తలను ఖండించారు. కూటమి భాగస్వామి కాంగ్రెస్‌తో ఇలాంటి ఒప్పందాలేమీ లేవని ఆయన ఆదివారం బెంగళూరులో స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లనున్న కుమారస్వామి.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, సోనియా గాంధీలతో సమావేశమై మంత్రిమండలి కూర్పుపై చర్చిస్తామన్నారు.‘రేపు ఢిల్లీ వెళ్తున్నాను. సోనియా, రాహుల్‌తో భేటీ అవుతాను. కేబినెట్‌ విస్తరణతోపాటుగా ఐదేళ్లపాటు సుస్థిర ప్రభుత్వం నడిపేందుకు అవసరమైన అంశాలపై చర్చిస్తాను.సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదు. దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవం’ అని స్వామి పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత 24 గంటల్లోనే బలనిరూపణ చేసుకుంటానని ఆయన వెల్లడించారు.

కుమారస్వామితోపాటుగా సిద్దరామయ్య, జి. పరమేశ్వరన్, డీకే శివకుమార్‌లుకూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా, ఆదివారం కాంగ్రెస్‌ నేతలతో కుమారస్వామి భేటీ అయ్యారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. అయితే డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్‌ నుంచి దళిత నేతను ఎన్నుకోవటం దాదాపు ఖాయమైంది. అది పీసీసీ చీఫ్‌ జి. పరమేశ్వరే అని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ బలం ఆధారంగా.. 34 మంత్రులను ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. అయితే, జేడీఎస్, కాంగ్రెస్‌ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం జేడీఎస్‌ సీఎం, 13 కేబినెట్‌ బెర్తులు, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం సహా 20 కేబినెట్‌ బెర్తులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. కుమారస్వామి తనవద్దే ఆర్థిక శాఖను అంటిపెట్టుకోవచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా పీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వరన్‌ ఎంపిక దాదాపు ఖాయంగానే తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలను కాపాడటంతో కీలకపాత్ర పోషించిన డీకే శివకుమార్‌కు కీలక శాఖను అప్పజెప్పాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్‌!
ముఖ్యమంత్రి సీటుతో పాటు పలుఅంశాల్లో కాంగ్రెస్‌తో విభేదాలున్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కుమారస్వామి తెలిపారు. రాజరాజేశ్వరినగర్, జయనగర్‌ అసెంబ్లీ స్థానాల ఎన్నికల విషయంపై ప్రస్తుతానికి చర్చించడం లేదన్నారు. ‘ఈ రెండుచోట్ల గెలవటం మాకు చాలా ముఖ్యం. ముందు ప్రభుత్వ ఏర్పాటు. ఆ తర్వాతే వీటిపై చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలతో సమావేశం అనంతరం.. బెంగళూరులోని ఓ హోటల్‌లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే క్యాంపులో ఉండాలా లేక ఇంటికెళ్లి బుధవారం ప్రమాణస్వీకారానికి రావాలా అన్న విషయంలో నిర్ణయించుకునే పూర్తి హక్కును ఎమ్మెల్యేలకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం తమిళనాడులోని ఓ దేవాలయ సందర్శనకు స్వామి బయలుదేరారు.