సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఓ మహిళ

న్యూఢిల్లీ : సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రమాణం చేయించారు.

న్యాయవాద వృత్తిని నిర్వహిస్తున్న ఓ మహిళను నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం ఇదే తొలిసారి. దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పని చేసిన మహిళల్లో ఇందు మల్హోత్రా 7వ వ్యక్తి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన మహిళల్లో జస్టిస్ ఫాతిమా బీవీ, జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమా పాల్, జస్టిస్ జ్ఞాన సుధ మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ ఆర్. భానుమతి ఉన్నారు.

సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో ఇందు మల్హోత్రా పేరును న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. బుధవారం ఆ సిఫారసును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.