సూర్య కంటే ఎక్కువ‌ వేగాన్ని చూపిస్తున్న‌….జ్యోతిక!

మలయాళ రీమేక్‌లో ‘చంద్రముఖి’ …వైవాహిక జీవితం అనంతరం కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ నటిస్తున్నారు వెండితెర ‘చంద్రముఖి’ జ్యోతిక. మలయాళంలో విజయం సాధించిన ‘హౌ ఓల్డ్‌ ఆర్‌ యూ’ చిత్రం రీమేక్‌ ‘36 వయదినిలే’లో నటించి మెప్పించారు. తాజాగా హిందీలో వచ్చిన ‘తుమ్హారి సులు’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘కాట్రిన్‌ మొళి’ అని పేరు పెట్టారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే మరో సినిమాలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు జ్యోతిక. మొత్తానికి సినిమాల ఎంపికలో తన భర్త సూర్య కంటే వేగాన్ని చూపుతున్నారు.
గత నెల మలయాళంలో విడుదలైన ‘మోహన్‌లాల్‌’ అనే సినిమా రీమేక్‌లోనే నటించడానికి అంగీకరించారు.ఈ సినిమాలో మంజువారియర్‌, ఇంద్రజిత్‌, సలీం, సిద్ధిక్‌ తదితరులు నటించారు. ప్రకాష్‌ అలెక్స్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సజిత్‌ యాహియా దర్శకత్వం వహించారు. ఇది హాస్యం కలగలిసిన సందేశాత్మక చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో మంజువారియర్‌.. మోహన్‌లాల్‌ అభిమానిగా నటించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన జ్యోతిక వెంటనే రీమేక్‌ చేద్దామని చెప్పినట్లు సమాచారం. దీంతో రీమేక్‌ పనులు మొదలు పెట్టారు. తమిళంలో రజనీకాంత్‌ అభిమానిగా జ్యోతిక నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.