సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టూ వీలర్లు

లగ్జరీ కార్ల తయారీలో పేరెన్నికగన్న బీఎండబ్లూ కంపెనీ తానంతట తానే నడుపుకుపోయే ద్విచక్ర వాహనాన్ని అంటే, సెల్ఫ్‌ డ్రైవింగ్‌ బైక్‌ను తయారు చేసింది. రెండేళ్లపాటు శ్రమించి ‘ఆర్‌1200 జీఎస్‌’ పేరిట తయారు చేసిన ప్రోటోటైప్‌ మోడల్‌కు సంబంధించిన వీడియోను కంపెనీ శనివారం నాడు విడుదల చేసింది. మానవ ప్రయత్నం లేకుండానే ఈ బైక్‌ తానంతటన తనే స్టార్ట్‌ అవుతుంది. యాక్సిలేటర్‌ ద్వారా వేగాన్ని పెంచుకుంటుంది. ఆ తర్వాత వేగాన్ని తగ్గించుకొని తానంతట తానే బ్రేక్‌ వేసుకుంటుంది. స్టాండ్‌ కూడా వేసుకొని ఆగిపోతుంది.

వీడియోలో కంపెనీ సేఫ్టీ ఇంజనీరు స్టీఫన్‌ హాన్స్‌ మాట్లాడుతూ మానవులు నడిపే బైకుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన మరిన్ని భద్రతా చర్యల గురించి తెలసుకోవడానికే ఈ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ప్రోటోటైప్‌ మోడల్‌ను విడుదల చేశామని చెప్పారు. శాస్త్ర పరిశోధనల కోసం, వాణిజ్య అవసరాల కోసం ఈ బైక్‌ను రూపొందించినప్పటికీ ఇప్పట్లో ఈ బైకులు మార్కెట్‌లోకి రాకపోవచ్చని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రోటోటైప్‌ బైక్‌ ద్వారా బైకులు నడిపేటప్పుడు మానవులు చేసే తప్పిదాలు ఏమిటో తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు కూడా ఇప్పటికీ ప్రయోగాల దశలోనే ఉన్న విషయం తెల్సిందే. అవి మార్కెట్లోకి విడుదలయ్యాకే అలాంటి టూ వీలర్లు రావచ్చు.