స్మార్ట్‌ఫోన్‌ కోసం అంత దారుణమా.

నగరంలోని ఉప్పల్‌లో విషాదం చోటుచేసుకుంది. కిడ్నాప్‌నకు గురైన ఇంటర్‌ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. మూర్ఖపు కోరికతో స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్‌కు చెందిన ప్రేమ్‌, సాగర్‌ స్నేహితులు. వీరిద్దరూ ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు. అయితే ప్రేమ్‌తో ఓ స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ఆ ఫోన్‌పై ఆశపడ్డ సాగర్‌.. తనకు ఆ స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వాలని కోరగా అందుకు ప్రేమ్‌ నిరాకరించాడు. ఈ నేపథ్యంలో సాగర్‌ పథకం ప్రకారం ఈ నెల 13న లాంగ్‌డ్రైవ్‌ పేరుతో బైకుపై ఆదిభట్ల వైపు తీసుకెళ్లాడని సమాచారం. అయితే సాగర్‌ తిరిగి రాగా, ప్రేమ్‌ మాత్రం ఇంటికి రాలేదు. దీంతో తమ కుమారుడు కనిపించడం లేదని ప్రేమ్‌ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి సాగర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు. ప్రేమ్‌ను అడిగితే స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వలేదని.. దీంతో లాంగ్‌డ్రైవ్‌ పేరుతో బైకు మీద ఆదిభట్లకు తీసుకెళ్లి అక్కడే స్నేహితుడిని కిడ్నాప్‌ చేసి హత్య చేశానని చెప్పాడు సాగర్‌. ఆపై ప్రేమ్‌తో ఉన్న స్మార్ట్‌ఫోన్‌ తీసుకుని.. అతడి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టినట్లు అంగీకరించాడు. దాదాపు మూడ్రోజుల తర్వాత కిడ్నాప్‌, హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే స్మార్ట్‌ఫోన్‌ కోసం స్నేహితుడిని మరో విద్యార్థి హత్య చేయడంపై ఉప్పల్‌ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.