హాలీవుడ్‌ చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించకూడదు…అమితాబ్‌‌

ముంబయి: హాలీవుడ్‌ రంగం ప్రాంతీయ చిత్ర పరిశ్రమను నాశనం చేసిందని అంటున్నారు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలనే చూడ్డానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘102 నాటౌట్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్‌ పై విధంగా వ్యాఖ్యానించారు.

‘ఇప్పుడు హాలీవుడ్‌ ప్రపంచమంతటా వ్యాప్తిచెందింది. దాంతో ప్రాంతీయ చిత్ర పరిశ్రమలు నాశమైపోయాయి. అది ఇంగ్లాండ్‌ కావొచ్చు, ఇటలీ కావొచ్చు. హాలీవుడ్‌ సినిమాలు విడుదలవుతున్నాయి..సొమ్ము చేసుకుంటున్నాయి. ఆ పరిశ్రమలో డబ్బు, అనుభవం ఉన్నాయి. క్వాలిటీ, క్వాంటిటీ ఉన్నాయి. వారికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. నా ఉద్దేశం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులను మెప్పించడానికి బాలీవుడ్‌ విభిన్న కథాంశాలతో సినిమాలు తీసుకురావాలి. సాంకేతికం పరంగా బాలీవుడ్‌ హాలీవుడ్‌కు సరిపోదు. కానీ ఇప్పుడు వస్తున్న యువ దర్శకులు, నిర్మాతలు హాలీవుడ్‌ స్థాయిలో సినిమాలు తీస్తారని నాకు అనిపిస్తోంది. మనం హాలీవుడ్‌ చిత్రాలను ఎక్కువగా ప్రోత్సహించకూడదు. అది మన చిత్ర పరిశ్రమను నాశనం చేసింది.’ అని ఆవేదన వ్యకత్ం చేశారు బిగ్‌బి.

‘102 నాటౌట్‌’ చిత్రంలో అమితాబ్‌, రిషి కపూర్‌ తండ్రీ కుమారుడు పాత్రల్లో నటించారు. ఉమేశ్‌ శుక్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మే 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.