హైదరాబాద్‌లో మందు బాబుల బీభత్స డ్రైవింగ్

 

హైదరాబాద్‌: రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఏఎస్‌రావు నగర్ నుంచి తార్నాక వైపు వస్తున్న స్కోడా కారు డీఏఈ కాలనీ వద్ద రాత్రి 12:30గంటల సమయంలో అదుపు తప్పి డివైడర్ ఎక్కి గోడను ఢీకొంది. ఈ క్రమంలోనే ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అశోక్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తిపై నుంచి కారు దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కారులో నలుగురు బీటెక్ విద్యార్థినులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీనిధి కళాశాలకు చెందిన విద్యార్థినులు పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఈశాన్యరెడ్డి అనే విద్యార్థిని కారు నడుపుతున్నట్లు సమాచారం. విద్యార్థినులు మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.