హైదరాబాద్ లో చెలరేగిన సన్‌రైజర్స్‌

సిక్సర్లు.. ఫోర్లతో పరుగుల వరద పారుతున్న ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌తో చెలరేగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కు బౌలర్లు విజయాన్నందించారు. ముంబయిపై 118 పరుగుల్ని కాపాడుకున్న సన్‌రైజర్స్‌.. కింగ్స్‌ ఎలెవన్‌        పంజాబ్‌పై 132 పరుగులు చేసి కూడా గెలిచింది. వరుసగా 4 విజయాలతో జోరుమీదున్న పంజాబ్‌కు షాకిచ్చి స్ఫూర్తిమంతమైన విజయాన్ని అందుకుంది. ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన పంజాబ్‌ పేసర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ (5/14) ప్రదర్శన వృథా అయింది.

మరోసారి బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా.. బౌలర్లు నిలబడ్డారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరును సైతం కాపాడి సన్‌రైజర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ముంబయితో మ్యాచ్‌ మాదిరే సన్‌రైజర్స్‌ మరోసారి అద్భుతం చేసింది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 13 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. మనీష్‌ పాండే (54; 51 బంతుల్లో 3×4, 1×6) అర్ధసెంచరీ చేయడంతో సన్‌రైజర్స్‌ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. పంజాబ్‌ బౌలర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో సన్‌రైజర్స్‌ కోలుకోలేకపోయింది. ఛేదనలో విఫలమైన పంజాబ్‌ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్‌కు శుభారంభం లభించినా.. సన్‌రైజర్స్‌ బౌలర్లంతా పట్టుదలగా బౌలింగ్‌ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. 4 విజయాల తర్వాత పంజాబ్‌కు ఇది తొలి ఓటమి. పంజాబ్‌ ఓడినా.. అంకిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
రషీద్‌ మొదలుపెట్టగా..: వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్‌కు 133 పరుగుల లక్ష్యం ఏమూలకూ సరిపోదనిపించింది. అందుకు తగ్గట్లే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (32; 26 బంతుల్లో 4×4, 1×6), క్రిస్‌ గేల్‌ (23; 22 బంతుల్లో 1×4, 2×6) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి పంజాబ్‌కు శుభారంభం అందించారు. పంజాబ్‌ ఆడుతు పాడుతూ లక్ష్యం దిశగా పయనిస్తున్నా.. సన్‌రైజర్స్‌ ఆశలు వదులుకోలేదు. కెప్టెన్‌ విలియమ్సన్‌ ఆటగాళ్ళలో స్ఫూర్తి నింపుతూ జట్టు నడిపించాడు. అందుకు తగ్గట్లే బౌలర్లు స్పందించడంతో పంజాబ్‌ పతనం ప్రారంభమైంది. లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ (3/19) వికెట్ల వేటకు శ్రీకారం చుట్టగా.. షకిబ్‌ (2/18), సందీప్‌శర్మ (2/17), బాసిల్‌ థంపి (2/14) తలా ఓ చేయి వేశారు. అంతే.. పంజాబ్‌ టపటపా వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న రాహుల్‌ను రషీద్‌.. గేల్‌ను బాసిల్‌ ఔట్‌ చేశారు. అప్పటికి జట్టు స్కోరు 8.2 ఓవర్లలో 57/2. ఈ సమయంలో మయాంక్‌ అగర్వాల్‌ (12), కరుణ్‌ నాయర్‌ (13) కొద్దిసేపు క్రీజులో నిలబడ్డారు. మయాంక్‌ను షకిల్‌ బోల్తాకొట్టించడంతో సన్‌రైజర్స్‌ శిబిరంలో ఆశలు చిగురించాయి. ఆ సమయంలో పంజాబ్‌ విజయానికి 47 బంతుల్లో 56 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లున్నాయి. ఐతే సన్‌రైజర్స్‌ బౌలర్లు గొప్ప బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. గోరంత లక్ష్యం సైతం కొండంతగా మారిపోయింది. కరుణ్‌, ఫించ్‌ (8), మనోజ్‌ తివారి (1), టై (4) వరుసగా వికెట్లు పారేసుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.

32 వాళ్ల పుణ్యమే..: అంతకుముందు ఈ సీజన్‌లో సొంతగడ్డపై తొలిసారి మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌.. రాజ్‌పుత్‌ దెబ్బకు విలవిలలాడింది. ఆ జట్టు 6 వికెట్లు కోల్పోతే ఐదు రాజ్‌పుత్‌కే దక్కడం విశేషం. మంచి పేస్‌, బౌన్స్‌ ఉన్న పిచ్‌పై రాజ్‌పుత్‌ నిప్పులు చెరిగాడు. అతడి ధాటికి సన్‌రైజర్స్‌.. తొలి ఓవర్లోనే కెప్టెన్‌ విలియమ్సన్‌ (0).. మూడో ఓవర్లో ధావన్‌ (11).. ఐదో ఓవర్లో సాహా (6) వికెట్లను కోల్పోయింది. 27 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 118 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌.. ఈ మ్యాచ్‌లో వంద దాడటమూ అనుమానంగానే కనిపించింది. సన్‌రైజర్స్‌ 132 పరుగులు చేయడంలో బ్యాట్స్‌మెన్‌ ప్రమేయం కంటే పంజాబ్‌ చెత్త ఫీల్డింగ్‌దే ప్రధాన పాత్ర. పంజాబ్‌ ఆటగాళ్లు మొత్తం 4 క్యాచ్‌లు జారవిడిచారు. అందులో మనీష్‌ పాండేవే మూడు (4, 9, 46 పరుగుల వద్ద) కాగా.. యూసుఫ్‌ పఠాన్‌ (7 వద్ద)ది ఒకటి. కెప్టెన్‌ అశ్విన్‌తో పాటు ఆండ్రూ టై, మయాంక్‌, మనోజ్‌ తివారి క్యాచ్‌లు నేలపాలు చేశారు. ఖాతా తెరవకముందే బరిందర్‌ బౌలింగ్‌లో షకిబ్‌ థర్డ్‌మాన్‌లో ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. ఐతే అది నోబాల్‌ కావడంతో సన్‌రైజర్స్‌ ఊపిరి పీల్చుకుంది. ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడుస్తున్నా బౌలర్లు మాత్రం క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశారు. నత్తనడకన సాగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు మాత్రమే నమోదయ్యాయి. 15వ ఓవర్లో పాండే బాదిందే మొదటి సిక్సర్‌. అతను అర్ధసెంచరీకి 48 బంతులాడాడు. ఈ సీజన్‌లో అత్యధిక బంతుల్లో సాధించిన అర్ధశతకం ఇదే కావడం గమనార్హం. పవర్‌ ప్లేలో 37 పరుగులు రాబట్టిన సన్‌రైజర్స్‌.. 100 పరుగులు చేయడానికి అవసరమైన బంతులు 100. రాజ్‌పుత్‌ వేసిన ఆఖరి ఓవర్లో సన్‌రైజర్స్‌ 6 పరుగులు చేసి.. 2 వికెట్లు కోల్పోయింది.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (సి) నాయర్‌ (బి) రాజ్‌పుత్‌ 11; విలియమ్సన్‌ (సి) అశ్విన్‌ (బి) రాజ్‌పుత్‌ 0; సాహా (సి) టై (బి) రాజ్‌పుత్‌ 6; పాండే (బి) రాజ్‌పుత్‌ 54; షకిబ్‌ (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) ముజీబ్‌ 28; యూసుఫ్‌ పఠాన్‌ నాటౌట్‌ 21; నబి (సి) మయాంక్‌ అగర్వాల్‌ (బి) రాజ్‌పుత్‌ 4; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 132; వికెట్ల పతనం: 1-1, 2-16, 3-27, 4-79, 5-128, 6-132; బౌలింగ్‌: అంకిత్‌ రాజ్‌పుత్‌ 4-0-14-5; బరిందర్‌ శరణ్‌ 3-0-27-0; అశ్విన్‌ 4-0-34-0; మనోజ్‌ తివారి 1-0-10-0; ముజీబ్‌ రెహ్మాన్‌ 4-0-17-1; ఆండ్రూ టై 4-0-28-0

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 32; గేల్‌ (సి) అండ్‌ (బి) థంపి 23; మయాంక్‌ అగర్వాల్‌ (సి) పాండే (బి) షకిబ్‌ 12; కరుణ్‌ నాయర్‌ ఎల్బీ (బి) రషీద్‌ 13; ఫించ్‌ (సి) పాండే (బి) షకిబ్‌ 8; మనోజ్‌ తివారి (సి) విలియమ్సన్‌ (బి) సందీప్‌ 1; అశ్విన్‌ (సి) విలియమ్సన్‌ (బి) రషీద్‌ 4; ఆండ్రూ టై ఎల్బీ (బి) సందీప్‌ 4; బరిందర్‌ రనౌట్‌ 2; అంకిత్‌ రాజ్‌పుత్‌ (బి) థంపి 8; ముజీబ్‌ రెహ్మాన్‌ నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 119; వికెట్ల పతనం: 1-55, 2-57, 3-77, 4-82, 5-88, 6-92, 7-96, 8-99, 9-101; బౌలింగ్‌: సందీప్‌ శర్మ 4-0-17-2; మహ్మద్‌ నబి 2-0-24-0; సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-25-0; బాసిల్‌ థంపి 2.2-0-14-2; రషీద్‌ ఖాన్‌ 4-0-19-3; షకిబ్‌ అల్‌హసన్‌ 3-0-18-2