112 జీబీ ఉచితం అంటు: బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన జియో

రిలయన్స్‌ జియో తన వినియోగదారులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించింది. వినూత్న పథకాలతో కస్టమర్లకు ఈసారి మరో ఆసక్తికర వలతో ఉచిత డేటా ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ పొందాలంటే జియో వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనుపించాలి. ‘జియో ఫోన్‌ మ్యాచ్‌ పాస్‌’ అని ప్రకటించిన ఈ ఆఫర్‌లో 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ వాలిడిటీ 56రోజులు. అంటే మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. దీనితోపాటు 4డే జియో క్రికెట్‌ ప్యాక్‌నుకూడా అందిస్తోంది. ఇందులో భాగంగా మొబైల్‌ ఫోన్లలో నాలుగు రోజులు పాటు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించింది. అయితే ఇందుకోసం జియో వినియోగదారుడు ద్వారా 10మంది స్నేహితులు లేదా, బంధువులను జియో ఫోన్‌ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది.

జియో ఫోన్‌ మ్యాచ్‌ పాస్‌ ఆఫర్‌
1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి. తరువాత సదరు స్నేహితులు టోల్‌ ఫ్రీకి కాల్‌ చేసి, వారి మొబైల్‌ ఫోన్‌ నెంబరు, తాముండే ఏరియా పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేయాలి. అనంతరం జియో రీటైలర్‌ వద్దగానీ, జియో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ద్వారా గానీ జియో ఫోన్‌ను పొందాల్సి ఉంటుంది. సంబంధిత స్నేహితుని జియో నంబర్‌ యాడ్‌ అయిన తరువాత మాత్రమే ఆయా ఖాతాల్లో ఈ ఉచిత డేటా ఆఫర్‌ క్రెడిట్‌ అవుతుంది. పాస్‌ ఆఫర్‌ ప్రక్రియ ముగిసిన అనంతరం దశలవారీగా డేటా ఆఫర్‌ను అందివ్వనుంది.

112 జీబీ ఆఫర్‌ పొందడం ఎలా?
112 జీబీ డేటా అందుకోవాలంటే మొత్తం 10మంది స్నేహితులు, లేదా బంధువులు జియో ఫోన్‌ కొనుగోలు చేయాలి. మొదటి నాలుగు సబ్‌స్క్రైబర్ల తరువాత రోజుకు 2 జీబీ చొప్పున నాలుగురోజుల పాటు 8 జీబీడేటా ఉచితం. 5గురు స్నేహితులు కొనుగోలు తరువాత 12రోజులుపాటు 24జీబీ వాడుకోవచ్చు. 6-9 మధ్య స్నేహితులను పరిచయం చేస్తే 8జీబీ (నాలుగురోజులు) డేటా. ఇక చివరగా 10వ ఫ్రెండ్‌కి గాను 24జీబీ డేటా 12 రోజుల (2జీబీ రోజుకు) పాటు అందిస్తుంది.