1,125 నక్షత్ర తాబేళ్ల పట్టివేత

Star Tortoise

మన రాష్ట్రం నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా రవాణా అవుతున్న 1,125 నక్షత్ర తాబేళ్లను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు డీఆర్‌ఐ అధికారులు ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.

యశ్వంత్‌పూర్‌–హౌరా ఎక్స్‌ప్రెస్‌లో తాబేళ్లు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో రైలు విశాఖకు రాగానే దాడి చేసి 1,125 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాబేళ్లను చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి సేకరించి కర్ణాటకలోని చెల్లూరు ప్రాంతం బాలెగౌడనహళ్లి గ్రామంలో అప్పగించారని, అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చి.. రైలులో హౌరాకు, అక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నట్టు నిందితులు చెప్పినట్టు డీఆర్‌ఐ అధికారులు పేర్కొన్నారు.