25 ఏళ్లుగా ఆకులు తిని బతుకుతున్నాడు

పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ బట్‌ (50) అనే వ్యక్తి.. ఒకటి, రెండు కాదు 25 సంవత్సరాలు నుంచి కేవలం ఆకులు, చెక్కలు తింటూ బతుకుతున్నాడు. బట్‌ డైరీలో భోజనం అన్న పదానికి చోటేలేదు. 25 ఏళ్లుగా ఆయన ఎప్పుడూ అనార్యోగం బారినపడలేదట. ఏ డాక్టర్‌ దగ్గరకు కానీ ఆస్పత్రికి కానీ వెళ్లలేదు. బట్ అలవాటును చూసి పాక్‌ ప్రజలు విస్తుపోతున్నారు. ఇన్నేళ్లపాటు భోజనం మానేసి, ఆకులు తింటూ ఎలా బతుకుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. బట్‌ భోజనం బదులుగా ఆకులు తినడానికి పేదరికమే కారణం.

పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ గుజ్రన్‌వాలా జిల్లాకు చెందిన బట్‌కు 25 ఏళ్ల వయసులో పేదరికంతో బాధపడ్డాడు. ఆ రోజుల్లో తమ కుటుంబం తీవ్ర పేదరికం అనుభవించిందని, భోజనం దొరికేదికాదని బట్‌ నాటి చేదు జ్ఞాపకాలను వెల్లడించాడు. చేయడానికి పని దొరికేది కాదని చెప్పాడు. దీంతో రోడ్లపై అడుక్కోవడం కంటే ఆకలి తీర్చుకునేందుకు ఆకులు తినడం మేలని అలవాటు చేసుకున్నానని బట్ తెలిపాడు. ఆ తర్వాత ఇదే తన అలవాటుగా మారిందని చెప్పాడు. కొన్నేళ్ల తర్వాత చేయడానికి పని, తినడానికి భోజనం లభించినా.. బట్‌ మాత్రం ఇదే అలవాటును కొనసాగించాడు.

బట్ ప్రస్తుతం ఓ గాడిద బండి పెట్టుకుని వస్తువులను ఒక చోట నుంచి మరో ప్రాంతానికి చేరవేస్తూ రోజుకు 600 రూపాయలు సంపాదిస్తున్నాడు. రోడ్డు పక్కగా బండి ఆపి, తాజా చెట్ల కొమ్మలను ఇంచుకుని తింటాడు. ఎక్కువగా మర్రి, కానుగ చెట్ల కొమ్మలను తింటానని బట్‌ చెప్పాడు.