అసభ్యంగా తాకాడు.. ఆపై..

లైంగిక వేధింపులను మౌనంగా భరించే వాళ్లు కొందరైతే.. ఎదురించేవాళ్లు మరికొందరు. తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గల్ల పట్టి పోలీసులకు అప్పగించారు ఓ మహిళ. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ఆకతాయిని కటకటాల వెనక్కి నెట్టారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే…

జార్జియా, సవన్నా ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో వచ్చాడు. వెయిట్రెస్ ‘ఈమెలియా(25)’ తన పనిలో నిమగ్నమై ఉండగా.. వెనకాల నుంచి వచ్చిన సదరు వ్యక్తి ఆమెను అసభ్యంగా తాకాడు. అంతే క్షణం ఆలస్యం చేయకుండా ఆమె అతన్ని గల్ల పట్టి లాగిపడేశారు. వెంటనే పోలీసులకు కేక వేయటంతో.. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. అయితే ఆమె మాత్రం అతన్ని వదలకుండా అలాగే పట్టుకున్నారు. చివరకు చేసిన పనికి భార్య, ఇద్దరు పిల్లల ముందే అతగాడు అరెస్ట్‌ అయ్యాడు.

నిందితుడు ర్యాన్‌ చెర్‌విన్‌స్కీ(31)ని రెండు రోజులు జైల్లో ఉండి.. ఆపై బెయిల్‌పై రిలీజ్‌ అయ్యాడు. జూన్‌ 30న ఈ ఘటన చోటు చేసుకోగా.పలువురు ఈమెలియాపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ‘మనం వేసుకునే దుస్తులు కాదు. మగాళ్లు మారాలి. మహిళలకు కూడా వాళ్లను ఎదురించే ధైర్యం రావాలి’ అని ఈమెలియా చెబుతున్నారు.