375 కోట్లతో శివగామి వెబ్ సిరీస్ పర్యవేక్షకుడిగా రాజమౌళి

బాహుబలి సినిమాలో ప్రతి పాత్ర ఎంతో ప్రాముఖ్యతను .. ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసినవాళ్లు ‘శివగామి’ పాత్రను ఎప్పటికీ మరిచిపోలేరు. నాయక .. ప్రతినాయకుల మధ్య కీలకంగా నిలిచిన ఆ పాత్ర అంతగా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. అందువల్లనే ఆ పాత్ర పేరే ప్రధానంగా చేసుకుని ఒక వెబ్ సిరీస్ ను రూపొందించడానికి ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ సన్నాహాలు మొదలుపెట్టింది.

‘బాహుబలి’కి ప్రీక్వెల్ గా ‘శివగామి’ వెబ్ సిరీస్ ను 3 సీజన్లలో అందించనున్నారు. ఇందుకోసం 375 కోట్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది. మాహిష్మతి సామ్రాజ్య విస్తరణలో ‘శివగామి’ ఎలాంటి పాత్రను పోషించిందనే విషయం చుట్టూనే ప్రధాన కథ తిరుగుతూ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కి దేవ్ కట్టా దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, రాజమౌళి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని చెబుతున్నారు.