730 రోజులు లీవ్‌ అడిగిన ఉద్యోగి

ఓ ఉద్యోగి రాసిన లీవ్‌ లెటర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఎందుకంటే సదురు ఉద్యోగి లీవ్‌ అడిగింది ఏ పది రోజులో, ఇరవై రోజులో కాదు.. ఏకంగా 730 రోజులు(అంటే రెండేళ్లు). దీనికి అతడు చెప్పిన కారణం కూడా ఆశ్చర్యకరంగానే ఉంది.. అతడు పనిచేస్తున్న శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి ప్రవర్తన నచ్చకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌ రైల్వేస్‌లో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న మహమ్మద్‌ హనీఫ్‌ గుల్‌ రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన షేక్‌ రషీద్‌ అహ్మద్‌పై కోపంతో 730 రోజుల సెలవు కోసం దరఖాస్తు చేశారు. అంతేకాకుండా తనకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు. రషీద్‌కు వృత్తి పట్ల నిబద్ధత లేదని, ఆయనకు రైల్వే మంత్రికి కావాల్సిన నైపుణ్యాలు లేవని, పాక్‌ ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా తాను ఆయనతో కలిసి పనిచేయలేనని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 26వ తేదీన ఆయన ఈ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు హనీఫ్‌కు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.

కాగా హనీఫ్‌ లీవ్‌ లెటర్‌కు ఆమోదం లభించలేదని తెలుస్తోంది. సోమవారం హనీఫ్‌ను చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలో అఘా వాసీమ్‌ను నియమించారు. హనీఫ్‌ సెలవు కోసం దరఖాస్తు చేసే ముందు రషీద్‌ ఆధ్వర్యంలో రైల్వే శాఖ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే శాఖ పనితీరుపై ఆయన అధికారులను మందలించినట్టు సమాచారం.