మ్యాచ్‌ మధ్యలో తేనెటీగలు.. నెటిజన్ల జోకులు

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తేనెటీగలు హల్‌చల్‌ చేశాయి. మ్యాచ్‌ చూడటానికి వచ్చినట్లు మైదానమంతా చుట్టుముట్టాయి. దీంతో ఆటగాళ్లు, అంపైర్లు నేలపై పడుకొని వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తపడ్డారు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 48వ ఓవర్‌లో ఈ అనూహ్య అతిథులు మైదానంలోకి రాగా.. మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. వెంటనే మైదాన సిబ్బంది ఫాగింగ్‌తో వాటిని తరిమికొట్టారు. అనంతరం మ్యాచ్‌ పునఃప్రారంభమైంది. ఇక తేనెటీగల రాకపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. బోరింగ్‌ మ్యాచ్‌లో తేనెటీగలు ఉల్లాసపరిచాయని ఒకరంటే.. వాటి దెబ్బకు ఆటగాళ్లంతా వణికిపోయారని మరొకరు కామెంట్‌ చేశారు. ఇంకొందరైతే శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్లపై తేనెటీగలు పగబట్టాయో ఏమో.. ఏడాదిలోపే రెండో సారి దాడి చేశాయంటున్నారు.

గతేడాది కూడా దక్షిణాఫ్రికా – శ్రీలంక జట్లను తేనెటీగలు భయపెట్టాయి. అప్పుడు కూడా శ్రీలంకనే బ్యాటింగ్ చేస్తుండటం గమనార్హం. దీంతో ఐసీసీ ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి గతంలో కూడా ఆ రెండు దేశాల మ్యాచ్‌లో తేనెటీగలు అంతరాయం కలిగించాయిని ట్వీట్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో శ్రీలంకను చిత్తు చేసింది. ఈ గెలుపుతో సఫారీలు టోర్నీ నుంచి పోతూ లంకను కూడా తమ వెంట పెట్టుకుపోతున్నారు.