సన్నీ డియోల్‌ చర్యపై విమర్శల వర్షం..

ప్రముఖ నటుడు, గురుదాస్‌పూర్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌ ఓ ప్రతినిధిని నియమించుకున్నారు. నియోజకవర్గంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాల్లో తన బదులు గురుప్రీత్‌సింగ్‌ పల్హేరీ హాజరవుతారని ఒక లేఖ విడుదల చేశారు. ఈ వ్యవహారంలపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాప్రతినిధిగా సేవలందించాల్సిందిపోయి తనకు ప్రతినిధిగా మరో వ్యక్తిని నియమిస్తారా అని కాంగ్రెస్‌ నేత సుఖ్‌జీందర్‌సింగ్‌ రంధ్వా ప్రశ్నించారు. ఓటర్లను సన్నీ దారుణంగా మోసం చేశాడని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు తన బదులు మరొకరిని ఆశ్రయించాలని కోరడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు. ఓటర్లు సన్నీని నాయకుడిగా ఎన్నుకున్నారని అతని ప్రతినిధిని కాదని ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో సైతం సన్నీ చర్యపై ట్రోలింగ్‌ కొనసాగుతోంది.

‘నా ప్రతినిధిగా మొహాలీ జిల్లాకు చెందిన గురుప్రీత్‌సింగ్‌ పల్హేరీని నియమించుకున్నాను. నా పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటాడు. ఏవైనా కార్యక్రమాలకు నేను హాజరు కాలేనప్పుడు ఆయనే చూసుకుంటారు. సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు’ అని సన్నీ ఒక లెటర్‌లో పేర్కొన్నారు. కాగా, తన నియామకంపై వస్తున్న విమర్శలపై గురుప్రీత్‌ స్పందించారు. నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు సేవలందించాలనే సదుద్దేశంతోనే ఎంపీ సన్నీ డియోల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా.. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీల్‌ జక్కర్‌పై ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ముంబైలో నివాసముండే సన్నీ.. లోక్‌సభ సమావేశాలకు అక్కడినుంచే వచ్చి వెళ్తున్నారు.