మొబైల్‌ ఫోన్‌లో 1,800 మంది మహిళల ఫొటోలు..

రోడ్డుపై నడిచివెళుతున్న 1,800 మందికిపైగా మహిళల్ని మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసిన కారు డ్రైవర్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్‌ జిల్లా మేగనూరుకు చెందిన శక్తివేలు (27) శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భార్యతో మోగనూరు బస్టాండ్‌లోని ఓ దుకాణంలో కూల్‌డ్రింక్‌ సేవించి బయటికి వచ్చాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి శక్తివేలు భార్యను మొబైల్‌ ఫోన్‌లో ఫొటో తీశాడు. దీంతో దిగ్భ్రాంతి చెందిన శక్తివేలు అతన్ని నిలదీశాడు. ఆగ్రహించిన అతను శక్తివేలుపై దాడి చేయడమే కాకుండా హత్యా బెదిరింపులు చేశాడు.

దీంతో మోగనూరు పోలీసులకు శక్తివేలు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆదివారం అతన్ని పట్టుకుని విచారణ జరిపారు. అతను మోగనూరుకు చెందిన అయ్యనార్‌ (42)గా తెలిసింది. సొంతకారును అద్దెకు నడుపుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా అతని కుమార్తెకు ఇటీవలే వివాహం చేసినట్లు తెలిసింది. అతని మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా మోగనూరు బస్టాండ్, బజారువీధి, సంత ప్రాంతాల్లో నడిచి వెళుతున్న 1,800 మందికి పైగా మహిళల ఫొటోలు బంధించినట్లు తెలిసింది. అతనిపై విచారణ జరుపుతున్నారు.