సీఎం వైఎస్‌ జగన్‌ మరో సంచలన నిర్ణయం

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 7 లక్షలు పరిహారం అందివ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యలపై స్పందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2014-19 మధ్య కాలంలో 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలి. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లాలి. వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఎక్కడైన సరే రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కలెక్టర్‌ కచ్చితంగా ఆ కటుంబం దగ్గరకు వెళ్లాలి. ఈ విషయంపై మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పే పరిస్థితి ఉండకూడదు. మనిషే చనిపోయాడు.. మనం కూడా తోడుగా లేకపోతే సరైన సందేశం ఇచ్చినట్టు కాద’ని ముఖ్యమంత్రి తెలిపారు. తమది ప్రజా ప్రభుత్వమని, మానవత్వం ఉన్న ప్రభుత్వం అని​.. ఆ దిశగానే పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సానుభూతితో, మానవీయతతో ఉండాలని అధికారులను ఆదేశించారు.