పిల్లలు పుట్టలేదని.. పూజారి భార్యతో సహా..

క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం సాధుకొట్టం గ్రామంలో మృత్యుంజయ ఆచారి, సరస్వతి దంపతులు తాము నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృత్యుంజయ ఆచారి దంపతులు రాచర్ల గ్రామం నుంచి 13 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం సాదుకొట్టం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ముడియాల స్వామి దేవాలయంలో పూజారిగా చేరి అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే.. వివాహమైన 13 సంవత్సరాల తర్వాత కూడ వీరికి సంతానం కలగలేదు. దీనికితోడు.. ఇటీవల సరస్వతి ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడ తోడవడంతో దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో జీవితంపై విరక్తి చెంది వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు. గత రెండు రోజుల క్రితమే వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి దుర్గంధం వస్తుండడంతో విషయం గుర్తించిన స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా మృత్యుంజయచారి దంపతులు ఇంటి దూలానికి విగతజీవులుగా వెలాడుతూ కనిపించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బనగానపల్లె ఎస్ ఐ శివాంజల్ సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.