అవెంజర్స్‌ సినిమా చూసి ఆస్పత్రి పాలైంది

అవెంజర్స్‌ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ ఉందో అందరికి తెలిసిన సంగతే. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిAన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ గత శుక్రవారం విడుదలైంది. అయితే ఈ లాస్ట్‌ సీజన్‌లో ఎమోషనల్‌ సీన్లు కాస్తా ఎక్కువగా ఉన్నాయట. దాంతో గత సిరీస్‌లతో పోలిస్తే.. ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ ప్రేక్షకుల చేత విపరీతంగా కంటతడి పెట్టిస్తోంది. ఎంతలా అంటే సినిమా చూసి ఏడ్చి ఏడ్చి ఓ ప్రేక్షకురాలు ఆస్పత్రి పాలైంది. వినడానికి వింతగా ఉన్న ఇది వాస్తవం.

వివరాలు.. చైనాకు చెందిన జియాలియా(21) అనే యువతి ‘అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ సినిమా చూస్తూ తీవ్ర ఉద్రేగానికి లోనయ్యి.. ఏడుపు ప్రారంభించింది. అది కాస్తా హై లేవల్‌కు చేరడంతో పాపం ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది. పరిస్థితిని గమనించిన జియాలియా స్నేహితులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకి చికిత్స చేసి.. మామూలు స్థితికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా జియాలియాకు వైద్యం చేసిన డాక్టర్‌ మాట్లాడుతూ.. ‘ఆమె సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం జియాలియా విపరీతంగా ఏడ్వడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. ఆమెని ఆస్పత్రికి తీసుకురాగానే తొలుత ఆమెకు ఆక్సిజన్‌ను అందించి.. శాంతపరిచి.. ఉద్రేకాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాం. దాంతో కొంతసేపటికే ఆమె మామూలు స్థితికి చేరుకుంద’ని తెలిపారు.

సూపర్‌ హీరో క్యారక్టర్స్‌ ఐన ఐరన్‌మేన్, కెప్టెన్‌ అమెరికా, హల్క్, థోర్, స్పెడర్‌ మేన్, బ్లాక్‌ ప్యాంథర్‌లను ఓ చోట చేర్చి మార్వెల్‌ సంస్థ తొలుత ‘ది అవెంజర్స్‌’ను రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత ‘అవెంజర్స్‌ : ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్‌’, ‘ఇన్ఫినిటీ వార్‌’ చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాల ముగింపే ‘ఎండ్‌గేమ్‌’. ఈ చిత్రం తర్వాత మళ్లీ సూపర్‌ హీరోల పాత్రలు కనిపించకపోవచ్చు. అందుకే ఎన్నిసార్లు చూసినా చివరిసారి చూడటం ప్రత్యేకమన్నట్టు మార్వెల్‌ అభిమానులు మళ్లీ మళ్లీ ‘ఎండ్‌ గేమ్‌’చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ‘ఇన్ఫినిటీవార్‌’ లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ను 2 రోజుల్లో ‘ఎండ్‌గేమ్‌’ దాటేసింది.