భార్యపై అనుమానంతో అతి దారుణంగా..

భార్యపై అనుమానంతో ఉన్మాదిలా మారిపోయాడో భర్త. పరాయి వ్యక్తులతో మాట్లాడుతున్నావనే నెపంతో ఇనుపచువ్వలతో భార్య ఒళ్లంతా వాతలు పెట్టాడు. కంట్లో కారం కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆ తర్వాత అన్నదమ్ముల సాయంతో ఆమెను తాళ్లతో బంధించాడు. వాళ్లంతా ఏకంగా ఆరు గంటల పాటు ఆమెను హింసించారు. ఈ దారుణం సూర్యాపేట జిల్లా యల్కారం గ్రామంలో చోటు చేసుకుంది.

యల్కారం గ్రామానికి చెందిన దొంగరి రామలింగయ్యకి ఐదేళ్ల క్రితం గౌతమితో వివాహం జరిగింది. కొద్దికాలం పాటు కాపురం సాఫీగానే జరిగింది. అయితే..రామలింగయ్యకి అనుమానం జబ్బు సోకింది. దీంతో గౌతమి తరచూ చిత్రహింసలకు గురిచేశాడు. వాళ్లిద్దరి మధ్య గొడవలు పెద్దమనుష్యుల వరకు వెళ్లాయి. పంచాయితీ పెట్టిన పెద్దమనుషులు నచ్చచెప్పటంతో గౌతమి సర్దుకుపోతూ వచ్చింది. అయితే..మంగళవారం అతని ఉన్మాదం పతాకస్థాయికి చేరింది. పరాయివ్యక్తులతో మాట్లాడుతుందనే నెపంతో సోదరులు నర్సయ్య, ముత్తయ్యలతో కలిసి గౌతమిని చిత్రహింసలకు గురిచేశారు. ఆరు గంటల పాటు నరకం చూపించాడు.

విషయం తెలుసుకున్న గౌతమి తల్లి సైదమ్మ..స్థానికుల సాయంతో కూతుర్ని విడిపించింది. అనంతరం సూర్యపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గౌతమి అత్తింటివారిపై హత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.