రూ. 8 కోట్లు అన్నారు.. ఇక్కడేమో రేకుల షెడ్డు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అక్రమాలకు ప్రజావేదికను అడ్డం పెట్టుకున్నారని రాష్ట్ర సమాచార శాఖా మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడ నిర్మాణం అక్రమమని తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని కాపాడుకునేందుకే ప్రజా వేదికను నిర్మించారని ఆరోపించారు. చట్టాలంటే ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. అందుకే జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) నిబంధనల పట్ల ముఖ్యమంత్రిగా ఏనాడు చిత్తశుద్దితో వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. ప్రజావేదికలో ఉన్న విలువైన పరికరాలను మళ్లీ వాడుకునేందుకు అధికారులు వాటిని బయటకు తరలించారని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు నష్టాన్ని తగ్గించేలా చూస్తున్నామని వెల్లడించారు. ప్రజావేదిక కోసం ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు.. కానీ ఇక్కడ చూస్తే మాత్రం రేకుల షెడ్డు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కాగా కృష్ణా నది కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైన సంగతి తెలిసిందే. అయితే ప్రజావేదికను కూల్చివేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నిరాకరించింది. దీంతో సంబంధిత అధికారులు ప్రజావేదికను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.