బిగ్‌బాస్‌ యాంకర్‌గా నయనతార

హీరో హీరోయిన్లు తమ క్రేజ్‌ను పారితోషికం పెంచుకోవడానికి వాడుకుంటుంటారు. అయితే వారి మార్కెట్‌ను ఇతరులు మరో విధంగా ఉపయోగించుకుంటారు. అలా ఓ టీవీ ఛానల్‌ అగ్రనటి నయనతార క్రేజ్‌ను భలే తెలివిగా వాడేసుకున్నారు. లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న దక్షిణాది టాప్‌ కథానాయకి నయనతార అన్న విషయం తెలిసిందే. సూపర్‌స్టార్‌ రజనీకాంత్, ఇళయదళపతి విజయ్‌ వంటి వారితో నటిస్తూనే, శివకార్తీకేయన్‌ వంటి యువ హీరోలతోనూ జత కట్టడానికి సై అంటోంది.

మరో పక్క హీరోయిన్‌ ఓరింయంటెడ్‌ పాత్రల్లోనూ నటిస్తూ అన్ని రకాల పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటోంది. అంతే కాకుండా తెలుగులోనూ అగ్ర హీరోలతో జత కడుతూ విరామం లేకుండా నటిస్తోంది. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మెరబోతోందనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యింది. నయనతార బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో వ్యాఖ్యాతగా పాల్గొనబోతోందనీ, మరో కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించబోతోందనీ, తన చిత్రాల ప్రమోషన్‌ కార్యమాల్లోనే పాల్గొనడానికి సమ్మతించని నయనతార బుల్లితెరపైకి రాబోవడం నిజంగా విశేషమే లాంటి రకరకాల ప్రచారం హోరెత్తింది.

కానీ నిజమేంటంటే నయనతార ఎలాంటి టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదట. ఇదంతా ఒక టీవీ ప్రచారానికి వాడుకున్న పనేనని తెలిసింది. ఆ మధ్య ఆర్యకు వధువు కావాలంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద ఎత్తున ప్రచారం పొందే ప్రయత్నం చేసిన ఆ ఛానల్, చివరికి ఆర్య ఏ అమ్మాయిని ఎంచుకోకపోవడంతో అదంతా ప్రబ్లిసిటీ స్టంటేనని తేలిపోయింది. తాజాగా నటి నయనతారను అదే ఛానల్‌ తన ప్రచారానికి వాడేసుకుంటోంది.