సీఎం విలాసవంతమైన విశ్రాంతి..రోజుకు..

రాష్ట్రంలో భీకర కరువు నెలకొంది. రాష్ట్ర ప్రజానీకం తాగునీటి కోసం హాహాకారాలు చేస్తున్నారు. కానీ ఇవేమీ పట్టని సీఎం కుమారస్వామి మాత్రం సరదాగా గడిపేందుకు రిసార్ట్‌కు తరలి వెళుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శనివారం నుంచి రెండు రోజుల పాటు కుమారస్వామి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో మడికేరికి కొంచెం దూరంలో ఇబ్బని రాయల్‌ రిసార్ట్‌కు చేరుకున్నారు. ఈ రిసార్ట్‌లో కేవలం ఒక రోజుకి రూమ్‌ అద్దె రూ. 40 వేలు. ఇందులో కుమారస్వామి మొత్తం నాలుగు గదులు బుక్‌ చేసుకున్నారు. దీంతో రెండు రోజుల విశ్రాంతి కోసం దాదాపు రూ. 2 లక్షల మేర ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విలాసవంతమైన విశ్రాంతి..
సీఎం కుమారస్వామి బస చేసే ఈ రిసార్ట్‌లో రూమ్‌లోపలే ప్రైవేట్‌ బార్, ప్రత్యేక స్విమ్మింగ్‌పూల్, ప్రత్యేక బాల్కనీ, మసాజ్‌ టబ్, ఓపెన్‌ షవర్, బోటింగ్‌ వంటి సకల సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోంటే సీఎం మాత్రం టెంపుల్‌ రన్, రిసార్ట్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు కుమారుడి గెలుపు, కుర్చీ కాపాడుకోవడమే సీఎంకు ముఖ్యమని రైతులు గోడు పట్టడం లేదని వాపోతున్నారు.