వాత తప్పదు : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. సామాన్యుడి నడ్డి విరిచేందుకు స్టేట్ రన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి ఇందన ధరలను పెంచేశాయి. అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ లో నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ముడిచమురు ధరలు బలపడ్డాయి. మంగళవారం (మే 28, 2019) కూడా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇందన ధరలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్ సైట్ డేటా ప్రకారం.. పెట్రోల్ ధర లీటర్ కు 9 పైసలు పెరిగితే.. డీజిల్ ధర లీటర్ 5 పైసలు వరకు పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ.71.86గా పెరిగింది. డీజిల్ లీటర్ ధర రూ.66.69గా పెరిగింది. సోమవారం (మే 27, 2019)రోజున ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.71.77గా ఉంటే.. డీజిల్ ధర రూ.66.54గా ఉంది. నాలుగు ప్రధాన నగరాల్లో సోమవారం పెట్రోల్ ధరలు 10-11 పైసలు పెరిగితే.. రిటైల్ డీజిల్ ధర స్థిరంగా ఉంది.

కోల్ కతాలో రిటైల్ ధర 9పైసలు పెరగడంతో రూ.73.92పైసలు పలుకుతోంది. సోమవారం పెట్రోల్ ధర రూ.73.83 రికార్డు అయింది. సోమవారంతో పోలిస్తే డీజిల్ ధర కూడా 5 పైసలు పెరగగా.. లీటర్ డీజిల్ ధర రూ.68.40 గా నమోదైంది. చెన్నైలో పెట్రోల్ ధర 9 పైసల పెంపుతో లీటర్ కు రూ.74.59పైసలుగా నమోదైంది. సోమవారం పెట్రోల్ ధర లీటర్ కు రూ.74.50పైసలుగా నమోదైంది.

ఇక డీజిల్ 5 పైసలు పెరగగా.. లీటర్ ధర రూ.70.50గా నమోదైంది. సోమవారం డీజిల్ ధర లీటర్ రూ.70.45గా నమోదైంది. ముంబైలో మంగళవారం లీటర్ పెట్రోల్ ధర రూ.77.47 నమోదైంది. సోమవారంతో పోలిస్తే 5 పైసలు వరకు పెరిగింది. డీజిల్ లీటర్ ధర రూ.69.83 పైసలు ఉంటే.. 5 పైసలు పెరిగి రూ.69.88గా నమోదైంది.