1200 మందిని సినిమా మోజు ఎరవేసి టోపీ పెట్టాడో ఓ ఘరానా కేటుగాడు

రంగుల ప్రపంచంలో విహరిద్దామనుకున్నారు. సినిమా స్టార్‌లుగా వెలిగి పోదామనుకున్నారు. కానీ ఆ తరువాత తెలిసింది తాము నిండా మోసపోయాయని. ఇలా ఒకరిద్దరు కాదు. ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోని 1200 మందిని సినిమా మోజు ఎరవేసి టోపీ పెట్టాడో ఓ ఘరానా కేటుగాడు. అసలు తెరవెనుక ఆ కేటుగాడి బాగోతం ఏంటి? కలల ప్రపంచంలోకి అడుగు పెడతామని వచ్చిన వాళ్లు ఎలా మోసపోయారు?

ఒక్కొక్కరికి ఒక్కో యాంబిషన్‌ ఉంటుంది. ఇంజనీర్ కావాలనో.. డాక్టర్ అవ్వాలనో కొందరు తపిస్తారు. ఇంకొందరు వెండితెరపై వెలిగిపోవాలని, సెలబ్రిటీలుగా అందరూ తమ గురించి చెప్పుకోవాలని తహతహలాడుతుంటారు. సరిగ్గా ఈ రెండోకోవకే చెందిన వ్యక్తుల బలహీనత ఆసరాగా.. మాయమాటలతో పబ్బం గడుపుకున్నాడు ఓ ఘరానా కేటుగాడు. తాను పెద్ద నిర్మాతనని, సినిమా ప్రొడక్షన్ ఉందని బిల్డప్ ఇచ్చాడు. నవ్యాంధ్రలో కొత్త మూవీ అసోసియేషన్ ఏర్పాటు చేశానని.. అందులో చేరితే మీ జీవితం పూలబాటేనని చాలామందిని నమ్మించాడు. నవ్యాంధ్రపదేశ్ ఫిలిం ఛాంబర్ పేరుతో ఒక సంస్థనే స్థాపించేశాడు. ఇందులో సభ్యత్వం ఉంటే.. నటీనటులుగా, సాంకేతిక నిపుణులుగా లైసెన్స్ ఉన్నట్లేనని నమ్మించాడు నవ్యాంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ వ్యవస్థాపకుడు ఎస్వీఎన్ రావు.

తనకు నిర్మాతలు, దర్శకులే కాదు.. పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులు బాగా తెలుసునని.. తమ ఛాంబర్‌లో చేరితే వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఉండదన్నాడు. సభ్యత్వం పేరుతో యాక్సిస్ కార్డులు ముద్రించి 50 వేల నుంచి 2 లక్షల దాకా రుసుం గుంజేశాడు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేయాలంటే ఏదో ఒక ఎరవేయాలి కదా. అందులో భాగంగా కోడె నాగు పేరుతో సినిమా తీస్తున్నట్లు అందరినీ నమ్మించాడు. ఓ వైపు మూవీ అసోసియేషన్‌, మరోవైపు సినిమా షూటింగ్.. దీంతో సినిమా పిచ్చోళ్లు వెండితెరపై వెలిగిపోదామన్న ఆశతో డబ్బులు సమర్పించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1200 మంది ఎస్వీఎన్ రావు బాధితులు ఉన్నారు. అప్పు చేసి మరీ డబ్బు కట్టారు. కోట్లు వసూలు చేసి దుకాణం బంద్ చేసేశాడు ఈ మోసగాడు. లోగుట్టు తెలియని బాధితులు.. ఎస్వీఎన్ రావును సంప్రదిస్తున్నప్పుడల్లా షూటింగ్ జరుగుతున్నట్లు మాయమాటలు చెప్పేవాడు. సినిమా తీస్తున్నామనే భ్రమను కల్పించి.. అవకాశం ఇస్తున్నామని నమ్మించి.. ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూనే గడిపేశాడు. చివరకు కొంతమంది యువతీ, యువకులు వివిధ జిల్లాల్లో ఎస్వీఎన్ రావుపై, అతని బూటకపు సంస్ధపై ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, తిరుపతితో పాటు జిల్లాల్లోను ఎస్వీఎన్ రావు, ఆ ఛాంబర్ మేనేజర్ వేణుగోపాల్ రావు మీద కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో 120మంది దాకా మోసపోయినట్లు సమాచారం. వాళ్ళలో కొందరు తిరుపతి వెస్ట్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్వీఎన్ రావు బాగోతం మరింతగా వెలుగులోకి వచ్చింది.

విచారణ మొదలుపెట్టిన తిరుపతి పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా బాధితులున్న నేపథ్యంలో ఇతర జిల్లాల పోలీసుల సహకారం తీసుకుంటామంటున్నారు. సినీ ప్రముఖులతో పరిచయాలు, రాజకీయ అండదండలు ఉండడంతోనే ఎస్వీఎన్ రావును అరెస్టు చేయలేదని బాధితులు వాపోతున్నారు. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి త్వరలోనే ఎస్వీఎన్ రావును అరెస్టు చేస్తామంటున్నారు పోలీసులు. సినీరంగంలో ప్రతిభ నిరూపించుకునేందుకు వస్తున్న యువతను మోసగించే ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వినిపిస్తోంది. రంగుల ప్రపంచంలో విహరిద్దామనుకునే యువత ఎస్వీఎన్ రావు లాంటి మోసగాళ్ళ ఉదంతాలు చూసైనా జాగ్రత్త పడాలి. లేకుంటే.. డబ్బులు పోవడంతో పాటు.. విలువైన భవిష్యత్తును కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడక తప్పదు.