తండ్రి లైంగిక వేధింపులు పోలీస్ స్టేషన్‌కి వెళితే ఇన్‌స్పెక్టర్ కూడా..

ఆమెకు భర్తయ్యాడు కానీ, పిల్లలకు తండ్రవ్వలేకపోయాడు. పెళ్లినాటి ప్రమాణాలను గాలికి వదిలేశాడు. తాళి కట్టేముందు ఇకపై వారు నీ పిల్లలు కాదు మన పిల్లలు అన్నాడు. వారికి నువ్వు అమ్మైతే, నేను నాన్నని అన్నాడు. ఆమాటకి ఎంతో మురిసి పోయింది. తల వంచి తాళి కట్టించుకుంది. కానీ వాడి చూపుల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోయింది. తండ్రి కాదు కదా.. కనీసం సాటి మనిషిలాగా కూడా చూడలేకపోయాడు. కామంతో కళ్లు మూసుకుపోయి పిల్లల్ని లైంగిక వేధింపులకు గురిచేశాడు. తిరువళ్లూరు జిల్లా పుళల్ సూరపట్‌కు చెందిన రాధికకు వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి రాధిక ఒంటరిగా నివసిస్తోంది. అంబత్తూరులోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది.

ఈ క్రమంలోనే తను పనిచేస్తున్న కంపెనీ యజమాని వాసుదేవతో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుందాం అనేసరికి కాదనలేకపోయింది. అందునా బిడ్డలకు తండ్రిలా ఉంటానని ప్రమాణం చేసేసరికి వెంటనే పెళ్లికి అంగీకరించింది. పెళ్లైన కొత్తలో పిల్లలతో బాగానే వుండేవాడు వాసుదేవ. ఆ తరువాతే అతడి బుద్ది బయటపడింది. పిల్లలు స్నానం చేస్తుంటే బాత్‌రూమ్‌లోకి తొంగి చూడడం, వారికి సెల్‌‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూపించి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో మారుటి తండ్రి చేస్తున్న పనిని తల్లికి వివరించింది కూతురు. ఇదేం పని అని మందలించినా వాసుదేవ వక్ర బుద్ది మార్చుకోలేదు.

ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్లారు. కానీ అక్కడ పోలీసులు ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించడమే కాకుండా ఇన్‌స్పెక్టర్ నటరాజన్ కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. దీనిపై డిప్యూటీ కమిషనర్‌‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తిరువళ్లూరు కోర్టు న్యాయూర్తి భరణీ ధరన్‌తో తమ గోడు విన్నవించుకున్నారు. బాధితుల ఫిర్యాదు స్వీకరించిన కోర్టు అసభ్యకరంగా ప్రవర్తించిన ఇన్‌స్పెక్టర్ నటరాజన్‌తో పాటు, మారు తండ్రి వాసుదేవపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి కోర్టుకు హాజరు కావాలంటూ వారిద్దరికీ ఉత్తర్వులు జారీ చేశారు.