40 రోజుల్లో ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేసుకోవాల్సిందే

వచ్చే నెల 31లోగా మీ పాన్‌కార్డుతో వ్యక్తిగత ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేసుకోకపోతే.. మీ పాన్‌కార్డు రద్దు కానుంది. పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు ఇంకా 40 రోజుల గడువు ఉంది. ఈ లోపు వాటిని లింక్‌ చేసుకోకపోతే.. దాదాపు 20 కోట్ల పాన్‌కార్డులు రద్దు కానున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) అధికారి తాజాగా వెల్లడించారు. దేశం మొత్తంలో 43 కోట్ల మంది పాన్ కార్డ్‌ని కలిగి ఉన్నారని, 120 కోట్ల మందికి ఆధార్‌ కార్డు ఉందని ఆ అధికారి తెలిపారు. ఇప్పటివరకు పాన్‌ కార్డుల్లో 50శాతం మాత్రమే ఆధార్‌తో లింక్‌ అయ్యాయని తెలిపారు. ఇక, ఆధార్ కార్డు లేని 40 రోజుల్లో దీనిని తీసుకొని.. పాన్‌తో అనుసంధానించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రుణాలు, క్రెడిట్ కార్డులు పొందటానికి చట్టవిరుద్ధంగా పాన్‌కార్డ్‌లను ఉపయోగించినట్లు వెల్లడి కావడంతో ఆధార్‌కు అనుసంధానం చేయని పాన్‌ కార్డులను రద్దు చేయాలని ఆదాయ పన్నుశాఖ నిర్ణయించింది. నేపాల్, భూటాన్‌లలో సైతం భారత పాన్‌కార్డ్‌లను గుర్తింపు కార్డుగా కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. ఆగస్టు 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే.. సెప్టెంబర్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. ఇదిలావుండగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం తన బడ్జెట్ ప్రసంగంలో పాన్‌ కార్డు లేకపోయినా.. దాని స్థానంలో ఆధార్ కార్డును ఉపయోగించి పన్నుచెల్లించవచ్చునని తెలిపారు.